గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 01:50:42

కమల్‌ ‘కరోనా’స్త్రం

కమల్‌ ‘కరోనా’స్త్రం
  • మధ్యప్రదేశ్‌ సంక్షోభంలో అనూహ్య మలుపు
  • సోమవారం జరుగని విశ్వాస పరీక్ష
  • ‘కరోనా’ సాకుతో సభ 26వరకు వాయిదా
  • నేడు బల పరీక్ష జరుపాలని గవర్నర్‌ అల్టిమేటం
  • అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కమల్‌నాథ్‌ సవాల్‌

భోపాల్‌, మార్చి 16: మధ్యప్రదేశ్‌ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతున్నది. కమల్‌నాథ్‌ సర్కార్‌ను ‘కరోనా వైరస్‌' గట్టెక్కించింది. విశ్వాస పరీక్ష జరుపకుండానే స్పీకర్‌ ఎన్‌పీ ప్రజాపతి సభను ఈ నెల 26 వరకు వాయిదా వేశారు. అయితే సీఎం కమల్‌నాథ్‌ మంగళవారం బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ తాజా అల్టిమేటం జారీ చేశారు. 


గవర్నర్‌ ప్రసంగం రెండు నిమిషాలే.. 

సోమవారం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్‌ లాల్జీ టాండన్‌.. సభను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సభ్యులు రాజ్యాంగ సంప్రదాయాలను పాటించాలని, ప్రజాస్వామ్య మర్యాదలను కాపాడాలని కోరారు. కేవలం రెండు నిమిషాల్లోనే ఆయన ప్రసంగం ముగించి సభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్‌ ప్రసంగం తర్వాత మంత్రి గోవింద్‌ సింగ్‌ మాట్లాడుతూ..కరోనా విజృంభణపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయని గుర్తుచేశారు. మరోవైపు, గవర్నర్‌ ఆదేశాల మేరకు వెంటనే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ చీఫ్‌ విప్‌ మిశ్రా డిమాండ్‌చేశారు. ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్‌.. సభను ఈ నెల 26 వరకువాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 


రాజ్‌భవన్‌కు మారిన సీన్‌ 

సభ వాయిదా వేయగానే మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో 106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ నివాసానికి చేరుకున్నారు. తక్షణమే బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్‌చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కమల్‌నాథ్‌ మంగళవారం సభలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ మరోసారి ఆదేశించారు. లేనిపక్షంలో ప్రభుత్వం మైనార్టీలో పడినట్లు భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు, సీఎం కమల్‌నాథ్‌ సోమ వారం సాయంత్రం గవర్నర్‌ లాల్జీ టాండన్‌తో సమావేశమయ్యారు. తర్వాత సీఎం మాట్లాడుతూ.. తన ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదని, విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీకి దమ్ముంటే తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సవాల్‌ చేశారు. తాము బలాన్ని నిరూపించుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.అంతకుముందు కమల్‌నాథ్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. కర్ణాటక పోలీసుల సాయంతో బీజేపీ పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బంధించిందని చెప్పారు. సభా వ్యవహారాలు స్పీకర్‌ పరిధిలోకి వస్తాయని, స్పీకర్‌ విధుల్లో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ఆర్టికల్‌ 175(2) ప్రకారం.. గవర్నర్‌ అధికారాలను వివరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు.


సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ 

తక్షణమే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు మంగళవారం విచారణ జరుపనుంది. 


logo
>>>>>>