పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తెల్లారి నుంచే తన మార్క్ రాజకీయాలు చేస్తున్నారు భగవంత్ మాన్. పంజాబ్‌లో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతి వ్యతిరేక హెల్ప్ లైన్ నెంబర్‌ను ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు. దీని ద్వారా ప్రజలు తమ వాట్సాప్ ద్వారా అవినీతిపై ఫిర్యాదులు చేయవచ్చని సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ తన వ్యక్తిగత వాట్సాప్ నెంబర్ అని ఆయన తెలిపారు.
ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఈ నెల 23న అంటే భగత్ సింగ్ ప్రాణత్యాగం చేసిన రోజు నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. నీతి, నిజాయితీతో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు తాము ఎంత మాత్రమూ వ్యతిరేకం కామని స్పష్టం చేశారు. ఎవరైతే అవినీతి చేస్తున్నారో వారికి మాత్రమే తాము పూర్తి వ్యతిరేకమని సీఎం స్పష్టం చేశారు.
ఎవరైనా మీ నుంచి లంచాలు అడిగితే.. దాన్ని ఆడియో రూపంలోనో, వీడియో రూపంలోనో రికార్డు చేయండి. దాన్ని నా వాట్సాప్ నెంబర్‌కు పంపండి. లంచాలు అడిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పంజాబ్ నుంచి అవినీతి పారిపోవాలి అంటూ సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు.