ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్): ఆకస్మిక వరదలకు కొండచరియలు విరిగిపడడంతో జలప్రళయాన్ని చవిచూసిన ఉత్తరకాశీలోని ధరాలీ గ్రామంలో సహాయక చర్యలు వరుసగా రెండవ రోజు బుధవారం కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు మరణించగా 100 మందికిపైగా గల్లంతయ్యారు. ఉత్తరకాశీని ఆకస్మిక వరదలు ముంచెత్తిన తర్వాత కేరళకు చెందిన 28 మంది సభ్యుల పర్యాటక బృందం ఆచూకీ తెలియరావడం లేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ 28 మందిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడిన కేరళకు చెందిన వారని కుటుంబ సభ్యులు తెలిపారు. మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన వారని వారు చెప్పారు.
మంగళవారం మధ్యాహ్నం సుఖీ టాప్ ప్రాంతంలో కూడా ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. బురద ప్రవాహం నుంచి బయటపడేందుకు ఆర్తనాదాలు చేస్తున్న ప్రజలు, సురక్షిత ప్రదేశానికి తరలిపోయేందుకు వరదలో చిక్కుకున్న తమ ఆప్తులను బిగ్గరగా పిలుస్తున్న స్థానికులకు చెందిన హృదయ విదారక దృశ్యాలతో కూడిన వీడియోలు అక్కడి పరిస్థితికి అద్దం పట్టాయి. ధరాలీలో కొండ చరియల కింద చిక్కుకుని మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బుధవారం సహాయక బృందాలు వెలికితీయడంతో మృతుల సంఖ్య ఐదుకి పెరిగింది.
మరో 100 మందికిపైగా వరద ప్రవాహంలో చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు(ఐటీబీపీ) ప్రతినిధి కమలేష్ కమల్ బుధవారం తెలిపారు. భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడడంతో రిషికేష్-ఉత్తరకాశీ హైవే దెబ్బతిందని, రోడ్డుపై అడ్డంకులు తొలగించేందుకు చర్యలు జరుగుతున్నాయని ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ మొహసెన్ షాహెబీ తెలిపారు. హార్సిల్ ప్రాంతంలో 11 మంది జవాన్ల ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదని ఆయన చెప్పారు. వరద తాకిడికి గురైన ప్రాంతాలలో 150 మందిని రక్షించినట్లు షాహెదీ తెలిపారు. కిన్నోర్ కైలాష్ యాత్ర మార్గంలో చిక్కుకుపోయిన మరో 413 మంది యాత్రికులను రక్షించినట్లు అధికారులు తెలిపారు.