అట్టావా, ఫిబ్రవరి 4: కెనడాలోని మాంట్రియల్ నగరంలో మూడు కాలేజీలు మూతపడడంతో వందలాది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఎన్నో ఆశలతో పెద్దఎత్తున ఫీజులు కట్టి చేరిన సుమారు 2 వేల మంది విద్యార్థులు వీధినపడ్డారు. వారిలో అత్యధికులు పంజాబ్‌కు చెందినవారే. మూడు కాలేజీలూ దివాలా పిటిషన్లు పెట్టుకున్నాయి. కొవిడ్ కల్లోలం వల్ల ఆదాయం లేక నష్టపోయామని కోర్టుకు విన్నవించాయి. ముందుగా మూడు కాలేజీలూ గత నవంబర్ 30 నుంచి జనవరి 10 వరకు శీతాకాల సెలవులను ప్రకటించాయి. మూసివేతకు వారంరోజుల ముందు బకాయీ ఫీజులను చెల్లించాలని విద్యార్థులను ఆదేశించాయి. ఒక్కో విద్యార్థి రూ.9 లక్షల నుంచి రూ.17.7 లక్షల వరకు చెల్లించాల్సి ఉండింది. కొందరు కట్టగలిగారు. చాలామంది కట్టలేకపోయారు. ఇటీవల ఇక కాలేజీలు తెరుస్తారనగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో చదువు, వసతి పోయింది. పత్రాలు కూడా చెల్లుబాటు కాని పరిస్థితి రావడంతో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కెనడా విద్యామంత్రికి, అక్కడి భారత రాయబారికి, మాంట్రియల్ ఎంపీకి వినతిపత్రాలు సమర్పించుకున్నారు. వీసా ఫీజులు, కాలేజీ ఫీజులు వాపసు ఇవ్వాలని, చదువు కొనసాగించే వీలు కల్పించాలని వారు డిమాండ్
చేస్తున్నారు.