డెహ్రాడూన్: శీతాకాలం సందర్భంగా కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను మూసేశారు. ఈ సందర్భంగా ఆదివారం వైదిక ఆచారాల ప్రకారం నిర్వహించిన భాయి దూజ్ ఉత్సవానికి 18 వేల మందికి పైగా యాత్రికులు హాజరయ్యారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు కేదార్ నాథ్, మధ్యాహ్నం 12.05కు యమునోత్రి మహా ద్వారాలను మూసేశారు. ఆ తర్వాత కేదార్నాథ్లోని శివ భగవానుడి విగ్రహాన్ని పల్లకీలో బయటకు తెచ్చి ఉఖీ మఠానికి, యమునోత్రిలోని యమునా దేవి విగ్రహాన్ని ఖార్సాలీకి తరలించారు. చలి కాలమంతా అక్కడే ఆ దేవుళ్లకు పూజలు నిర్వహించనున్నారు.
జమిలికి వ్యతిరేకంగా టీవీకే తీర్మానం
చెన్నై: కేంద్ర ప్రతిపాదిత జమిలి ఎన్నికలను తమిళ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం(టీవీకే) వ్యతిరేకించింది. ఆదివారం పార్టీ కార్య నిర్వాహక మండలి సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. తమిళనాడు నుంచి నీట్ పరీక్షను ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేసింది. రాష్ట్రంలో కుల గణన నిర్వహించకుండా దానికి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని డీఎంకే ప్రభుత్వంపై మండిపడింది. అధికారంలోకి రావడానికి అబద్ధాలతో కూడిన హామీలను ఇచ్చారని డీఎంకేపై విరుచుకుపడింది.