Obesity | న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా 2030నాటికి సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడతారని ఓ అధ్యయనం వెల్లడించింది. వీరు అనేక ఆరోగ్యపరమైన, మానసిక అస్వస్థతలను ఎదుర్కొంటారని లాన్సెట్ కమిషన్ ప్రచురించిన ఈ నివేదిక తెలిపింది. నిరోధించదగిన ఆరోగ్య సమస్యలతో 100 కోట్ల మంది బాధపడతారని పేర్కొంది. ప్రపంచంలోని 10-24 సంవత్సరాల మధ్య వయస్కుల్లో సుమారు సగం మంది నిరోధించదగిన ఆరోగ్య సమస్యలు ఉండే దేశాల్లో జీవిస్తారని పేర్కొంది.
హెచ్ఐవీ/ఎయిడ్స్, మనో వ్యాకులత, పోషకాహార లోపం, తక్కువ వయసులోనే గర్భధారణ వంటి నిరోధించదగిన సమస్యలు వీరిని వేధిస్తాయని తెలిపింది. యువత మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని, వాతావరణ మార్పులకు సంబంధించిన పర్యవసానాలు దీనికి జతకూడుతాయని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల పర్యవసానాలను జీవితాంతం అనుభవించే తొలి తరంగా నేటి యువత నిలుస్తుందని పేర్కొంది. దీని ప్రభావం వల్ల 2100నాటికి చెప్పుకోదగిన స్థాయిలో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని తెలిపింది.