డెహ్రాడూన్ : చెంపదెబ్బ కొట్టిన ఉపాధ్యాయుడిపై ఓ విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన బుధవారం ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… గురునానక్ స్కూల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడైన గగన్‌దీప్ సింగ్ కోహిల్ గత వారం ఓ విద్యార్థిని చెంప దెబ్బ కొట్టారు. బుధవారం ఇంటర్వెల్ సమయంలో ఆయన తరగతి గదిని వీడి వెళుతున్నప్పుడు నిందితుడు తన టిఫిన్ బాక్స్‌లోంచి తుపాకీ తీసి ఆయన వెనకవైపు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పారిపోవడానికి ప్రయత్నించాడు.
ఇతర టీచర్లు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధిత టీచర్ మెడకు తూటా వల్ల గాయమైంది. ఆయనకు వెంటనే శస్త్ర చికిత్స చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తుపాకీని సీజ్ చేశారు. నిందితుడికి అది ఎలా లభించిందన్న విషయమై దర్యాప్తు చేస్తున్నారు.