Sunil Kumar : పిల్లలకు పరీక్షలుంటే వాళ్లకంటే వాళ్ల తల్లిదండ్రులే ఎక్కువగా కంగారుపడుతుంటారు. వారి నిద్ర, తిండి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పరీక్షకు బయలుదేరేటప్పుడు ఇంటి బయటికి వచ్చి సాగనంపుతారు. పరీక్ష బాగా రాయి అంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెబుతారు. ఈ విషయాల్లో తండ్రుల కంటే తల్లులు ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. కానీ తమిళనాడు (Tamil Nadu) లోని ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి (Intermediate Student) కి మాత్రం ఆ అదృష్టం లేకుండా పోయింది. తీరా పరీక్ష నాడు, పరీక్షకు బయలుదేరే ముందు తల్లి అనారోగ్యంతో కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అయినా అతను పుట్టెడు దుఖ్ఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసి వచ్చాడు. ఆ తర్వాత తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా వల్లియూర్ గ్రామానికి చెందిన సునీల్ కుమార్ (17) తన తల్లి సుభలక్ష్మి (40), చెల్లెలితో కలిసి ఉంటున్నాడు. ఆరేళ్ల క్రితమే తండ్రి క్రిష్ణమూర్తి చనిపోవడంతో కూలీనాలి చేసి పిల్లలిద్దరినీ తల్లే పోషిస్తోంది. సునీల్‌కుమార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. అతని చెల్లెలు స్కూల్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో సుభలక్ష్మికి గుండెపోటు వచ్చింది. దాంతో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమె ఇటీవలే డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చింది. సునీల్‌కు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం అతను తమిళం పరీక్ష రాయాల్సి ఉంది.
దాంతో ఉదయాన్నే లేచి రెడీ అయ్యి పరీక్షకు బయలుదేరే ముందు పరిస్థితి విషమించడంతో అతని తల్లి ఒక్కసారిగా కుప్పకూలింది. విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది. పిల్లల ఏడుపు విని ఇరుగుపొరుగు ఆ ఇంటికి చేరుకున్నారు. పిల్లలను ఓదార్చారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్.. తాను బాగా చదువుకోవాలనేది తన తల్లి కోరిక అని, ఇప్పుడు పరీక్ష రాయకపోతే అమ్మ ఆత్మ క్షోభిస్తదని చెబుతూ ఆమె కాళ్లపై పడి విలపించాడు. అమ్మ కోసం తాను పరీక్ష రాసి వస్తానని చెప్పాడు. దాంతో ఇరుగుపొరుగు కూడా సునీల్‌కు సహకరించారు. అతడిని దగ్గరుండి పరీక్షకు తీసుకెళ్లారు. పరీక్ష పూర్తవగానే ఇంటికి తీసుకొచ్చి సుభలక్ష్మి అంత్యక్రియలు పూర్తిచేశారు.
పరీక్ష అనంతరం సునీల్ కుమార్‌తోపాటు స్కూల్లోని అతని స్నేహితులు, క్లాస్మేట్స్ అంతా అతని ఇంటికి వెళ్లారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు సునీల్‌తో ఉండి ధైర్యం చెప్పారు. ఈ విషాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఇది తమిళ సమాజమని, తమకు తమ జీవితాలకంటే చదువే ముఖ్యమని పేర్కొన్నారు. తమిళులకు ఏదైనా సమస్య వస్తే ఆ ప్రతిధ్వనిని నిజంగా నిశ్శబ్దం ఆవహిస్తుందని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సునీల్‌కుమార్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్వయంగా సునీల్ కుమార్ ఇంటికి వెళ్లి సుభలక్ష్మి మృతికి సంతాపం తెలిపారు.