లక్నో: కాలేజీకి మొబైల్ ఫోన్లు తెచ్చిన విద్యార్థుల నుంచి టీచర్ వాటిని స్వాధీనం చేసుకున్నాడు. ఒక జూనియర్ ఇంటర్ విద్యార్థి దీనిపై కక్షగట్టాడు. మూడు రోజుల తర్వాత కత్తితో దాడి చేసి ఆ టీచర్‌ను పొడిచాడు. (Student Stabs Teacher) తీవ్రంగా గాయపడిన ఆయన మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మిహిన్పూర్వాలోని నవయుగ్ ఇంటర్ కాలేజీలో మొబైల్ ఫోన్లు నిషేధించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందట ఇంగ్లీష్ టీచర్ రాజేంద్రప్రసాద్ క్లాస్‌లో విద్యార్థులను చెక్ చేశాడు. మొబైల్ ఫోన్లు తెచ్చిన వారి నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్లను ఆ విద్యార్థులకు తిరిగి ఇచ్చేశాడు.
కాగా, ఉపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ చర్యపై కొందరు విద్యార్థులు ఆగ్రహించారు. గురువారం ఒక స్టూడెంట్ క్లాస్‌లో ఆ టీచర్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ టీచర్‌ను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.
మరోవైపు తనను కత్తితో పొడిచిన విద్యార్థికి మరో ఇద్దరు సహకరించినట్లు ఉపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించాడు. ఆయన కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థి దాడికి వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మిగతా ఇద్దరు విద్యార్థుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.