పాట్నా: మేడపై చదువుతున్న బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో ఆమె మేడ అంచు వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఒక కోతి ఆ బాలికను తోసేసింది. (Monkeys push Girl off roof) కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా ఆ విద్యార్థిని అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బీహార్లోని సివాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న ప్రియా ఒంటరిగా ఇంటి మేడపై చదువుకొంటున్నది. అయితే కోతుల గుంపు ఆ మేడపైకి వచ్చాయి. అక్కడ చదువుతున్న ప్రియా వద్దకు అవి చేరాయి.
కాగా, భయాందోళన చెందిన ప్రియా ఆ కోతుల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయితే అవి ఆమెపైకి దూకి దాడి చేశాయి. ఒక కోతి ఆ బాలికను తోసింది. దీంతో ఆమె కిందపడి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆ బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రియా మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే కోతి తోసేయడంతో మరణించిన ప్రియా మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించేందుకు ఆమె కుటుంబం నిరాకరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.