Odisha hostel tragedy | ఒడిశాలోని ఓ హాస్టల్లో భోజనం చేసిన ఓ విద్యార్థిని చనిపోయింది. మరో 25 మంది దవాఖాన పాలయ్యారు. వీరిలో ముగ్గురు బాలికల పరిస్థితి విషమంగా ఉన్నది. మెరుగైన చికిత్స అందించేందుకు వీరిని బాలాసోర్ జిల్లా దవాఖానకు తరలించారు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థినిలు వాంతులు చేసుకోగా.. ఒకరోజు ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది.
ఒడిశా బాలాసోర్ (Balasore) జిల్లాలోని సోరో పట్టణం (Soro town) లో పురుబాయి కన్యాశ్రమం (Purubai Kanyashram) ఉన్నది. ఇక్కడ చదువుతున్న బాలికలు అక్కడి హాస్టల్లో శుక్రవారం భోజనం చేశారు. అనంతరం పలువురు విద్యార్థులు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. దాంతో ఆహారం కలుషితం కారణంగా ఇలా జరుగుతున్నదని గ్రహించిన హాస్టల్ సిబ్బంది వారిని స్థానిక దవాఖానకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ 10వ తరగతి విద్యార్థిని రబీనా సింగ్ (Rabina singh) శనివారం ఉదయం చనిపోయింది. మరో 25 మంది బాలికలను చికిత్స నిమిత్తం సోరో సీహెచ్సీలో చేర్చారు.
విద్యార్థినిలు వాంతులు చేసుకోవడంతో వెంటనే దవాఖానకు తరలించినట్లు కన్యాశ్రమ కార్యదర్శి సుమతి మొహంతి తెలిపారు. హాస్టల్లో అందిస్తున్న నీరు, ఆహారం కలుషితం కావడం వల్లే బాలికలు అస్వస్థతకు గురయ్యారని సోరో సీహెచ్సీ వైద్యులు పేర్కొన్నారు. బాలికలు గత నాలుగు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నారని వారు చెప్పారు. విచారణ పూర్తయ్యేంత వరకు బాలిక మరణంతోపాటు ఇతర బాలికల అనారోగ్యానికి దారితీసిన విషయం గురించి వ్యాఖ్యానించలేమని బాలాసోర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ దులాల్సేన్ జగదేవ్ అన్నారు.