కాసర్గడ్: కేరళలో పదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి ఎలుకలకు పెట్టే విషం తిని ఆత్మహత్య చేసుకున్నది. మంగళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన ఓ యువకుడు ఆ అమ్మాయిని వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో 24 ఏళ్ల అన్వర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతనిపై పోక్సో కింద కేసు(POCSO Case) బుక్ చేశారు. ఆ చట్టంలోని 5, 6 సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేశారు.
పరారీలో ఉన్న అన్వర్‌ను బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. సూసైడ్ చేసుకునేలా ప్రోత్సహించిన అతనిపై కేసు బుక్ చేసినట్లు విద్యానగర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ అమ్మాయికి అన్వర్ పరిచయం అయ్యాడు. అన్వర్‌కు దూరంగా ఉండాలని తన కూతురికి చెప్పానని, అన్వర్‌కు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు ఆ అమ్మాయి తండ్రి పోలీసులతో పేర్కొన్నాడు.
అయితే జనవరి 23వ తేదీన ఎలుకల విషం తీసుకున్న ఆ అమ్మాయి విషమ పరిస్థితిలో కనిపించింది. ట్రీట్మెంట్ సమయంలో ఆమె నుంచి పోలీసులు, మెజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకున్నారు. అన్వర్ విపరీతంగా వేధించడం వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆమె తన వాంగ్మూలంలో పేర్కొన్నది. స్కూల్‌కు వెళ్తున్న సమయంలో అన్వర్ వెంటపడేవాడని, ఫోటోలు పంపిస్తానని బెదిరించేవాడని తన కూతురు చెప్పినట్లు తండ్రి తెలిపాడు. తన కజిన్ ఎంగేజ్‌మెంట్‌ను కూడా బ్రేక్ చేసేందుకు బెదిరించాడని కూతురు చెప్పినట్లు తండ్రి గుర్తు చేశాడు. ఆత్మహత్య వెనుక అయిదుగురు వ్యక్తులు ఉన్నట్లు తన కూతురు పోలీసులకు చెప్పిందని తండ్రి తెలిపాడు.