ఇంఫాల్, డిసెంబర్ 4: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ ఘర్షణలు రేగాయి. సోమవారం రెండు మిలిటెంట్ గ్రూపులు పరస్పరం కాల్పులకు తెగబడ్డాయి. టెంగ్నోపాల్ జిల్లాలో ఇరు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది మిలిటెంట్లు చనిపోయారని జిల్లా అధికారులు వెల్లడించారు. మయన్మార్ సరిహద్దుకు ఆనుకొని వున్న లైథు గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు చెప్పారు.
‘కొంతమంది మిలిటెంట్స్ మయన్మార్‌కు వెళ్తుండగా, ఆ ప్రాంతంలో ఆధిపత్యం కలిగిన మరో మిలిటెంట్ గ్రూప్ మెరుపుదాడికి దిగింది’ అని జిల్లా అధికారి ఒకరు తెలిపారు. కాల్పుల సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకోగా, ఘటనాస్థలంలో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారంతా స్థానికులు కాదని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మే నెల ప్రారంభం నుంచి మణిపూర్ రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.