Sonam Wangchuk : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి బహుశా రాజకీయ లక్ష్యాలు ఉండి ఉండవచ్చని ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. తాజాగా ఆయన ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీజేపీతోపాటు, గత నెలలో తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సహా అనేక అంశాలపై మాట్లాడారు. అయితే, సీజేపీ రాజకీయాలకు అతీతంగా ఉంటేనే బాగుంటుందని సలహా ఇచ్చారు. ‘‘సీజేపీకి, దాని ఫౌండర్ అభిజీత్ దీప్కేకు రాజకీయ లక్ష్యాలు ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, ఈ విషయాన్ని వారేమీ నాకు చెప్పలేదు. ఇది నా అంచనా మాత్రమే.
రాజకీయ లక్ష్యాలు ఉండటంలో తప్పులేదు. సీజేపీ రాజకీయంగా మారితే యువతకు అనేక అవకాశాలు వస్తాయనేది నిజం. కానీ, ఇలాంటి ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా, తటస్థంగా ఉంచితేనే మంచిది. ప్రజలు సీజేపీని నిష్పక్షపాతంగా నడిచే యువత, విద్యార్థుల ఉద్యమ శక్తిగా చూస్తున్నారు. తటస్థంగా ఉంటూ, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే సంస్థ అని భావిస్తున్నారు. ఇలా ఉంచితేనే అనేక లక్ష్యాలు సాధించవచ్చు. రాజకీయ శక్తిగాకంటే ఉద్యమ శక్తిగా ఉంచడమే మంచిది. అయితే, సమాజం నుంచి ఏమీ ఆశించకపోవడానికి సీజేపీ నేతలేమీ సన్యాసులు కాదు.
నేను విశ్లేషించినంత వరకు వాళ్లు రాజకీయ శక్తిగా మారుతారు’’ అని వ్యాఖ్యానించారు. అభిజీత్ దీప్కే గతంలో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్న విషయంపై తనకు అవగాహన లేదన్నారు. ఇక, తాను ఆమరణ దీక్ష చేస్తున్న సమయంలో దీక్ష విరమింపజేసే అంశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సంప్రదించామని, కానీ, ఈ విషయంలో ఆయన నుంచి సరైన స్పందన రాలేదన్నారు. ఈ విషయం పార్లమెంట్‌కు చేరాలని తాము భావించామన్నారు.
రాహుల్ గాంధీ తమ దీక్షాస్థలికి వచ్చుంటే, అప్పుడు విషయానికి చాలా ప్రాధాన్యం దక్కేదని సోనమ్ వాంగ్‌చుక్ వివరించారు. కానీ, దీక్ష చేస్తున్నప్పుడు, ముగిసిన తర్వాత ఆయన తనను సంప్రదించలేదని వెల్లడించారు.