CJP protest : నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ సీజేపీ చేపట్టిన ఆందోళనలో విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో గాయపడ్డ విద్యార్థులకు సంఘీభావంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సీజేపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా సీజేపీ ఒక ప్రకటన చేసింది.
జూలై 24, శుక్రవారం దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రతిరోజు, ఒకే జిల్లాలో, ఒకే డిమాండ్ అంటూ.. బాధిత విద్యార్థులకు సంగీభావంగా, దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయాలని సూచించింది. విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు కలిసి సమన్వయంతో పని చేయాలని, రవాణా, అనుమతులు వంటి విషయంలో సహకరించుకోవాలని సూచించింది. విద్యార్థులపై జరిగిన దాడులను ఖండిస్తూ నినాదాలు చేయాలని, విద్యార్థుల డిమాండ్లు వినిపించాలని వివరించింది.
‼️Nationwide Call For Peaceful Protest‼️ pic.twitter.com/D2jte841z2
— Cockroach is Back (@Cockroachisback) July 23, 2026
అలాగే, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, మెమొరాండం టెంప్లెట్ కోసం సీజేపీ వెబ్సైట్ సంప్రదించాలని సూచించింది. ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై అంటూ పేర్కొంది. దేశంలో జరుగుతున్న పేపర్ లీకేజీలను వ్యతిరేకిస్తున్నామని, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ విషయంలో వెనక్కు తగ్గేది లేదని సీజేపీ స్పష్టం చేసింది. మరోవైపు శుక్రవారం జరిగే నిరసనల్లో అనేక పార్టీలు దేశవ్యాప్తంగా పాల్గొనబోతున్నాయి.