Sonam Wangchuk : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆదివారం ఆయన దీక్ష ప్రారంభమైంది. ఇదే అంశంపై ఈ నెల 20 నుంచి అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ దీక్ష కొనసాగిస్తున్నారు. దీనికి మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ అక్కడే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర వైఫల్యాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ దీక్ష ఒక్క నీట్ పరీక్షకు సంబంధించింది కాదని, విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం చేస్తున్నదని సోనమ్ అన్నారు. నీట్ పేపర్ లీకవ్వడం వల్ల దేశవ్యాప్తంగా 21 మంది మరణించినట్లు వారు చెబుతున్నారు. ఈ పరీక్ష నిర్వహణలో వైఫల్యం వల్ల మరణించిన వారి స్మృత్యర్థం దీక్షా స్థలి వద్ద ఒక స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు, సోనమ్ ఆమరణ దీక్షకు దిగిన తర్వాత నుంచి జంతర్‌మంతర్ వద్ద ప్రభుత్వం, పోలీసులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని సీజేపీ ఆరోపిస్తోంది. ఇక్కడ మంచినీరు, శానిటేషన్ వంటి సౌకర్యాల్ని ప్రభుత్వం నిలిపివేసిందని అభిజీత్ దీప్కే ఆరోపిస్తున్నారు. పోలీసులకు, అధికారులకు ఎంతగా విన్నవించినా స్పందన లేదన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు సహకరించాలని కోరారు.
ఈ నెల 20 నుంచి సీజేపీ జంతర్‌మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది ఆ పార్టీ. దీనిపై సోనమ్ ఇటీవలే స్పందించారు. ఈ నెల 28 లోపు ప్రభుత్వం స్పందించకుంటే తాను ఆమరణ దీక్షకు దిగుతానని చెప్పారు. దీని ప్రకారం ఈ రోజు ఆయన సీజేపీ ఫౌండర్ అభిజీత్‌తో కలిసి దీక్షకు దిగారు. ఆయన ఆమరణ దీక్ష చేపట్టారు. ఆదివారం నాడు ఈ దీక్షకు సంఘీభావంగా చాలా మంది ప్రముఖులు హాజరై మద్దతు తెలిపారు.