న్యూఢిల్లీ: మ్యారిటల్ రేప్ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం వైదొలగారు. ఐపీసీ సెక్షన్ 375లోని రెండో మినహాయింపును రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. వీటిపై విచారణ సమీప భవిష్యత్తులో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. భార్య సమ్మతి లేకుండా ఆమెతో శృంగారంలో పాల్గొన్న భర్తపై అత్యాచారం కేసు నమోదు చేయకుండా మినహాయింపు ఇవ్వడం మహిళల హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదిస్తున్నారు. దీపావళి సెలవులకు ముందే తీర్పు చెప్పాలని తాను భావించానని, అయితే సమీప భవిష్యత్తులో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని సీజేఐ తెలిపారు. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది. సీజేఐ చంద్రచూడ్ వచ్చే నెల 11న పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన పదవీ కాలంలో చివరి పని దినం వచ్చే నెల 8.