CJI DY Chandrachud | పోలీస్స్టేషన్ల నుంచి కోర్టుల వరకు న్యాయ వ్యవస్థ మొత్తం దివ్యాంగ పిల్లల సమస్యలను అర్థం చేసుకోవడం, పరిష్కారంపై దృష్టి సారించాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్‌పై తొమ్మిదో జాతీయ వార్షిక స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు శారీరక సవాళ్లతో పాటు, సమాజంలో ప్రబలంగా ఉన్న పక్షపాతం, మూస పద్ధతులు, అపోహలను ఎదుర్కోవాల్సి ఉందన్నారు. దివ్యాంగ పిల్ల సమస్యలను న్యాయవ్యవస్థ అర్థం చేసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ల నుంచి కోర్టుల వరకు న్యాయ వ్యవస్థ ఈ పిల్లల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేలా చూడాలన్నారు.
సమస్యల పరిష్కారానికి ‘రెస్టొరేటివ్ జస్టిస్ విధానం’ ప్రవేశపెట్టడం ఓ మార్గమన్నారు. న్యాయ సమస్యలను ఎదుర్కొంటున్న పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడం, చదువు చెప్పడం, వృత్తి శిక్షణ ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని జువెనల్ జస్టిస్ చట్టం చెబుతుందన్నారు. దివ్యాంగ పిల్లలు అభివృద్ధి కోసం ఆయా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగ పిల్లల గురించి మాట్లాడే సమయంలో ఇంటర్ సెక్షనాలిటీ భావనను తోసిపుచ్చలేమన్నారు. లింగం, కులం, జాతి, సామాజిక ఆర్థిక హోదావంటి గుర్తింపునకు వైకల్యం అడ్డుగీత గీస్తుంన్న ఆయన.. దాంతో దివ్యాంగ పిల్లలు మరింత వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
ఈ పరిణామాలు భవిష్యత్‌లో భయంకరమైన ప్రభావం చూపుతుందని.. ఈ క్రమంలో వారి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వ్యవస్థలు ఆ బాలలకు సాధికారత కల్పించేలా ఉండాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అవసరాలను చాలా సందర్భాల్లో వ్యక్తిగత అవసరాలుగానే చూస్తున్నామన్న ఆయన.. సామాజిక బాధ్యతగా చూడడం లేదన్నారు. వ్యవస్థలు వారి అవసరాలను తీర్చలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగ పిల్లలకు అదనపు రక్షణ లభించేలా రాష్ట్రాలు చూడాలన్నారు. యూనిసెఫ్ ఇండియా సహకారంతో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఈ జాతీయ వార్షిక స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ సదస్సు జరిగింది.