న్యూఢిల్లీ, డిసెంబర్ 6: సామాన్యుడి కోసమే సుప్రీంకోర్టు ఉందన్న బలమైన సందేశాన్ని పంపుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి ఓ నిర్దిష్ట గడువును నిర్ణయించేందుకు ఉమ్మడి జాతీయ జ్యుడీషియల్ విధానం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శనివారం పిలుపునిచ్చారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో సీజేఐ మాట్లాడుతూ న్యాయవ్యవస్థ సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండాలని అన్నారు.
వ్యాజ్యం ఖర్చును ఎలా తగ్గించాలి, కేసులపై నిర్ణయం తీసుకునేందుకు తగిన కాల పరిమితిని ఎలా నిర్దేశించాలి అన్న విషయాలే ఇప్పుడు తన ప్రాధాన్యతలని ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత గురించి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ అధికారాల వికేంద్రీకరణకు సంబంధించి రాజ్యాంగ నిబంధనను ఆయన గుర్తు చేశారు.
పెండింగ్ కేసులన్నీ పూర్తిగా పరిష్కారానికి నోచుకుంటాయని తాను చెప్పడం లేదని, అది ఎన్నటికీ జరగదని, లిటిగేషన్ నిరంతర ప్రక్రియ కావడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉందని ఆయన తెలిపారు. కొత్త కేసులు దాఖలవుతూనే ఉంటాయని, కాని పాత కేసులను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వాన్ని సాధనంగా మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.