అమరావతి: పదవీ విరమణ తర్వాత ఎటువంటి పోస్టును స్వీకరించబోను అని సీజేఐ బీఆర్ గవాయ్(CJI Gavai) పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని దారాపూర్ స్వగ్రామంలో ఆయన్ను ఇవాళ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ప్రభుత్వ హోదాను స్వీకరించబోను అని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత తనకు కావాల్సినంత సమయం దొరుకుతుందని, అప్పుడు ఎక్కువ సమయాన్ని దారాపూర్, అమరావతి, నాగపూర్‌లో గడపనున్నట్లు ఆయన తెలిపారు. సీజేఐ గవాయ్ ఈ ఏడాది నవంబర్‌లో రిటైర్ కానున్నారు. స్వగ్రామంకు విచ్చేసిన గవాయ్‌కు భారీ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు. కేరళ, బీహార్ మాజీ గవర్నర్, తండ్రి ఆర్ఎస్ గవాయ్ స్మారకం వద్ద నివాళి అర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన వార్షిక కార్యక్రమంలో పాల్గొన్నారు. దారాపూర్ మార్గంలో నిర్మించనున్న గేట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ గేట్‌కు ఆర్ ఎస్ గవాయ్ పేరు పెట్టనున్నారు.