న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశంలో అధికారులు, ప్రత్యేకించి పోలీసు అధికారుల పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీతో అంటకాగుతూ చెలరేగిపోయే పోలీసులను ఆ తర్వాత న్యాయస్థానాలు కూడా రక్షించలేవని స్పష్టంచేశారు. వసూళ్లకు పాల్పడే అధికారులు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కొని కోర్టులను ఆశ్రయించడం కొందరు అధికారులకు, ముఖ్యంగా పోలీసులకు ఓ అలవాటుగా మారిందని, దేశంలో ప్రస్తుతం ఇదో ట్రెండ్‌గా కొనసాగుతున్నదని అసహనం వ్యక్తం చేశారు. పోలీసు అధికారుల ప్రవర్తనపై తనకు చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. సస్పెండ్‌కు గురైన ఛత్తీస్‌గఢ్ అదనపు డీజీపీ గుర్జిందర్ పాల్ సింగ్ తనపై నమోదైన క్రిమినల్ కేసుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.. అధికారులు, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలో స్థాయీ సంఘం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.