న్యూఢిల్లీ : అస్సాంలో 27 మంది వ్యక్తులను విదేశీయులుగా నిర్ధారించిన గౌహతి హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ, పౌరసత్వంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశీయుల హోదాపై నిర్ణయాలు నిష్పక్షపాత, చట్టబద్ధ, సహేతుక ప్రక్రియ ద్వారానే తీసుకోవాలని సోమవారం తీర్పు చెప్పింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్ ఈ 27 మంది వ్యక్తులను విదేశీయులుగా ప్రకటించింది.
దీనిని గౌహతి హైకోర్టులో అప్పీల్ చేసుకోగా, ట్రిబ్యునల్ తీర్పునే సమర్థించింది. దీంతో కేసు సుప్రీంకోర్టుకు చేరింది. పౌరసత్వం, విదేశీయుల హోదా అనేది ఒక కీలకమైన రాజ్యాంగ, చట్టపరమైన అంశమని ధర్మాసనం పేర్కొన్నది. విదేశీయుల చట్టం, 1949లోని సెక్షన్ 9 ప్రకారం, ఒక వ్యక్తి భారత పౌరుడా? విదేశీయుడా? అన్న ప్రశ్న తలెత్తినప్పుడు, తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత సదరు వ్యక్తిపైనే ఉంటుంది.