CIC appointments : చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (CIC) సభ్యులను ఖరారు చేస్తూ వెల్లడించిన తుది జాబితాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారి పేర్లే లేవని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన విమర్శలకు కేంద్ర ప్రభుత్వవర్గాలు కౌంటరిచ్చాయి. కమిషన్ సభ్యులుగా ఖరారు చేసిన వారిలో ఐదుగురు వెనుకబడిన వర్గాలకు చెందినవారే ఉన్నారని పేర్కొన్నాయి.
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తాను సభ్యులుగా ఉన్న ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ.. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్ణయించిందని, కానీ తుది జాబితాలో మాత్రం ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం దక్కలేదని రాహుల్‌గాంధీ విమర్శించారు. దాంతో జాబితాలోని 8 పేర్లలో ఐదుగురు వెనుకబడిన వర్గాలకు చెందినవారే ఉన్నారని ప్రభుత్వ వర్గాలు కౌంటరిచ్చాయి.
సీఐసీ సభ్యుల తుదిజాబితాలోని 8 మందిలో ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఓబీసీ, ఒక మైనారిటీ సభ్యుడితోపాటు ఒక మహిళా సభ్యురాలు కూడా ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా 2005లో సీఐసీని ఏర్పాటు చేశారు. 2014 వరకు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఒక్కరిని కూడా సభ్యులుగా నియమించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఎస్టీ కమ్యూనిటీకి సురేష్చంద్రను సభ్యుడిగా నియమించింది.
అదేవిధంగా 2020లో హీరాలాల్ సమారియాను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమించారు. ఆ తర్వాత 2023లో తను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయ్యారు. దాంతో సీఐసీ కమిషనర్ అయిన తొలి దళిత వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు.