CIBIL Score | న్యూఢిల్లీ, ఆగస్టు 24: బ్యాంకుల నుంచి మొదటిసారి రుణాన్ని తీసుకునేవారికి ‘సిబిల్ స్కోర్’ తప్పనిసరి కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. క్రెడిట్ స్కోర్ తక్కువ లేదా జీరో ఉందన్న కారణంతో, బ్యాంకు రుణాన్ని తొలిసారి కోరుతున్న వారి దరఖాస్తులను తిరస్కరించరాదని కేంద్రం తెలిపింది. అయితే, దరఖాస్తుదారుల నేపథ్యాన్ని తెలుసుకునేందుకు తనిఖీలు చేయాల్సిందేనని బ్యాంకులకు సూచించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి సభలో ఈ మేరకు సమాధానమిచ్చారు.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఒక వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ రిపోర్టులను అందించడానికి రూ.100 వరకు వసూలు చేయవచ్చునని, ఇంతకు మించి వసూలు చేయటం ఆమోదనీయం కాదని పంకజ్ చౌదరీ సభకు తెలియజేశారు. రుణాల మంజూరులో కనీస సిబిల్ స్కోర్ అంటూ ఆర్బీఐ నిర్దేశించలేదని కేంద్రం తెలిపింది. కేవలం రుణ చరిత్ర లేదన్న సాకుతో మొదటిసారి బ్యాంకు రుణాన్ని కోరుతున్న దరఖాస్తులను తిరస్కరించరాదని రుణ సంస్థలకు తెలియజేశామని, ఆర్బీఐ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసినట్టు తెలిపారు.