Christmas celebration | దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరోసారి కొవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా పండుగను జరుపుకుంటున్నారు. ప్రజలు ఇళ్లు, కార్యాలయాల్లో మేరీ మాత, ఏసుక్రీస్తు విగ్రహాలతో అలంకరించారు. ఢిల్లీలోని పలు చర్చిల్లో క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. కరోనా నేపథ్యంలో రెండేండ్ల తర్వాత ఢిల్లీ చర్చిల్లో గంటలు మోగాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని సేక్రెడ్ హార్ట్ క్యాథడ్రల్ చర్చిని సందర్శించి మానవాళి సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.
శనివారం అర్ధరాత్రి నుంచే సామూహిక ప్రార్థనలతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రిస్టియన్లు చర్చిలకు వచ్చి ప్రార్థనలు చేసి కొవ్వొత్తులు వెలిగించారు. ఒకవైపు చలి గాలులు.. మరోవైపు కొవ్వొత్తుల వెలుగుల మధ్య క్రిస్మస్ వేడుకలు ఆహ్లాదకరంగా సాగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా ఒడిశాలో 27 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో ఇసుక శాంతాక్లాజ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. పాట్నాలో తయారుచేసిన 1500 కిలోల టమోటాల సంత ఎంతగానో ఆకట్టుకుంటున్నది. దీనిని ప్రపంచ ప్రఖ్యాత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్లో మాస్క్‌లు పంపిణీ చేసిన శాంటా.. కొవిడ్ నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచాలని ప్రజలకు సందేశం ఇచ్చారు.
ఈ సంవత్సరం క్రిస్మస్ నేపత్యంలో ఢిల్లీ అంతటా చర్చిలు భక్తులతో నిండిపోయాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రార్థనలు జరగలేదు. దాంతో ఈసారి పెద్ద సంఖ్యలో ప్రజలు చర్చిలకు తరలివచ్చారు. దేశ రాజధానిలోని అన్ని చర్చీలు విద్యుత్ దీపాలతో తళుకులీనాయి. శాంతాక్లజ్ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు విధుల్లో ఉన్న పోలీసులకు మాస్క్‌లు అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఆసియాలోని రెండో అతిపెద్ద చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ చర్చికి వచ్చి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ముంబైలోని అన్ని చర్చీలు భక్తులతో నిండిపోయాయి. రోడ్లపై నృత్యాలు చేస్తూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మిఠాయిలు పంచుతూ.. బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు. ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి తన ఇంట్లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. అందరికీ ప్రేమ, శాంతి, మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోరుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తమిళనాడులో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న చర్చిలన్నీ భక్తులతో నిండిపోయాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా గుజరాత్ అంతటా అర్ధరాత్రి ప్రార్థనలు జరిగాయి. వేడుకలకు గుర్తుగా చర్చిలు, మాల్స్, ఇతర భవనాలు విద్యుత్ దీపాలతో ప్రకాశిస్తున్నాయి.
#WATCH | People dance & sing at Marine Drive in Mumbai as they celebrate the festival of #Christmas pic.twitter.com/kG5nSwBTfl
— ANI (@ANI) December 25, 2022