Chiru – Bobby | మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విడుదలకు రెడీ అవుతుండగా, వెంటనే దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాను #ChiruBobby2, MEGA 158 అనే వర్కింగ్ టైటిల్స్‌తో పిలుస్తుండగా, ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు – బాబీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
అదేంటంటే… ఈ సినిమాలో మెగాస్టార్‌తో పాటు మరో స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే టాక్. ఇప్పటికే తమిళ స్టార్ హీరో కార్తీ పేరు వినిపించగా, ఆ తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా ఈ సినిమాలో భాగం అవుతారనే వార్తలు ఊపందుకున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం, మోహన్‌లాల్ ఈ ప్రత్యేక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే చిరంజీవి – మోహన్‌లాల్ లాంటి ఇద్దరు దిగ్గజ నటులను ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు నిజంగా పండుగే అవుతుంది. ఇక కథ విషయానికి వస్తే… ‘మెగా 158’ లో చిరంజీవి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఆయన కూతురిగా ఓ యంగ్ అప్‌కమింగ్ హీరోయిన్ను ఎంపిక చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆ హీరోయిన్ ఎవరన్నదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ కాస్టింగ్‌తో పాటు టాప్ టెక్నీషియన్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారని సమాచారం. బాబీ ఈసారి తన రెగ్యులర్ టీమ్‌కు భిన్నంగా కొత్త టాలెంట్‌ను రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది. మాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి ఈ సినిమాకు డీఓపీగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఆయన ‘కురుప్’, ‘కింగ్ ఆఫ్ కోతా’, ‘లక్కీ భాస్కర్’, ‘లోకా: చాప్టర్ 1’ వంటి సినిమాలకు పని చేసి ప్రశంసలు అందుకున్నారు. మ్యూజిక్ విషయంలో కూడా రెగ్యులర్ కంపోజర్ కాకుండా, మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టు కొత్త తరహా సౌండ్ ఇచ్చే సంగీత దర్శకుడిని ఎంపిక చేయనున్నారని టాక్. రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు