భోపాల్: మధ్యప్రదేశ్లో కలరా (Cholera) వ్యాప్తి కలకలం రేపుతున్నది. సుమారు 80 మందికిపైగా ఈ వ్యాధి బారినపడ్డారు. కలరా వల్ల ఇద్దరు మరణించారు. భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫూప్ నగరంలోని 5, 6, 7 వార్డుల్లో నీరు కలుషితమైంది. దీంతో స్థానిక ప్రజలకు కలరా సోకింది. ఇప్పటి వరకు సుమారు 84 మంది కలరా బారిన పడినట్లు చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ డీకే శర్మ తెలిపారు. స్థానిక, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారిని అడ్మిట్ చేసి చికిత్స అందించినట్లు చెప్పారు. కోలుకున్న రోగులు ఇళ్లకు తిరిగి వెళ్లారని అన్నారు. ప్రస్తుతం ఆరుగురు రోగులు ఆసుపత్రిలో ఉన్నారని తెలిపారు. ఇద్దరు రోగులను గ్వాలియర్ ఆసుపత్రికి రిఫర్ చేయగా వారు కోలుకుని తిరిగి వచ్చారని చెప్పారు.
కాగా, కలరా వ్యాపించిన వారిలో ఇప్పటి వరకు ఇద్దరు వృద్ధులు మరణించినట్లు చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ డీకే శర్మ తెలిపారు. రెండు రోజుల కిందట జ్వరం కారణంగా బాలిక చనిపోయినట్లు చెప్పారు. నగర పాలక సంస్థ కలిషిత నీటిని మూసివేసిందని, ఇతర మార్గాల ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తున్నదని తెలిపారు. కలరా సోకిన ప్రాంతంలో సర్వే చేయడంతో శాంపిల్స్ సేకరించినట్లు చెప్పారు. ఆ ప్రాంత ప్రజలకు క్లోరిన్ మాత్రలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కాచి చల్లార్సిన నీటిని తాగాలని ప్రజలకు సూచించారు.