న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16 : ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అధికార బీజేపీ-జేడీయూ కూటమికి కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన ఎల్జేపీ(రాం విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ మళ్లీ షాక్ ఇచ్చారు. ఓటర్లను ప్రభావితం చేసే శక్తి తనకు ఉందని మంగళవారం ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఆయన కూటమికి గుర్తు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 20,000 నుంచి 25,000 ఓట్లను తాను ప్రభావితం చేయగలనని చిరాగ్ చెప్పారు.
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలలో తన పార్టీకి గణనీయమైన వాటా కావాలని చిరాగ్ పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఐదు స్థానాలలో పోటీచేసి ఐదింటినీ ఆయన పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు 40 స్థానాలు కేటాయించాలని చిరాగ్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. తనకు ఇబ్బందిగా ఉన్నా తన డిమాండ్లను నెరవేర్చకున్నా కూటమి నుంచి తప్పుకోవడానికి తాను వెనుకాడబోనని ఆయన హెచ్చరించారు.