న్యూఢిల్లీ : ఎల్ఏసీ వెంట శాంతి కోసం భారత్‌తో కలిసి పని చేస్తున్నామని చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంఘే తెలిపారు. రెండు పొరుగు దేశాలనీ, సత్సంబంధాలు కొనసాగించడం భారత్, చైనాకు ప్రయోజనాలకు అనుగుణంగాఉన్నాయన్నారు. సింగపూర్‌లోని షాంగ్రీ-లా చర్చల్లో ఆయన మాట్లాడారు. దక్షిణ చైనా సముద్రంతో సహా ప్రాదేశిక వివాదాలను పరిష్కరించుకునేందుకు శాంతియుత మార్గాలపై పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత్ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట వివాదంపై ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘మేం భారత్‌తో కమాండర్ స్థాయిలో 15 రౌండ్ల చర్చలు జరిపాం. ఈ ప్రాంతంలో శాంతి కోసం కలిసి పని చేస్తున్నాం’ అని.. బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్‌లోని ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ తన్వి మదన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
రెండేళ్ల క్రితం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) భారత్‌తో ఎల్ఏసీ వద్ద పలు పాయింట్ల వద్ద యథాతథ స్థితిని ఎందుకు మార్చింది ? సైనిక ఘర్షణకు దారితీసిన కారణాలను వివరించాల్సిందిగా చైనా మంత్రిని తన్వి కోరారు. ఇదిలా ఉండగా.. 2020, మే 5 నుంచి పాంగోంగ్ సరసు ప్రాంతంలో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్నది. ఆ తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు, నివాస గృహాలతో పాటు ఇతర మౌనిక సదుపాయాలను కల్పిస్తున్నది. లడఖ్ ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్ – చైనా మధ్య 15 రౌండ్ల సైనిక చర్చలు జరిగాయి. చర్చల ఫలితంగా గతేడాది పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతంలో, గోగ్రా ప్రాంతంలో ఇరుదేశాలు బలగాలను వెనక్కి తీసుకున్నాయి. అయితే, సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.