న్యూఢిల్లీ, డిసెంబర్ 21: రైతులకు 56 అంగుళాల ఛాతిని చూపించిన కేంద్ర ప్రభుత్వం.. చైనా ముందు మాత్రం 0.56 ఇంచులైపోయిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్, చైనా మధ్య చోటుచేసుకొన్న ఉద్రిక్తతలపై పార్లమెంట్లో చర్చ చేపట్టకపోవటంపై కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించింది. చర్చ కోసం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆప్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘సరిహద్దులో జరిగిన ఘర్షణపై ప్రజలకు, పార్లమెంట్‌కు జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నది. ధర్నా చేసే రైతులపై 56 అంగుళాల ఛాతి చూపించే బీజేపీ సర్కారు.. చైనా ముందు మాత్రం 0.56 అంగుళాలకు తగ్గిపోయింది’ అని ఎద్దేవా చేశారు. చైనా నుంచి దిగుమతులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం వాటిని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నదని ప్రశ్నించారు.