న్యూఢిల్లీ, నవంబర్ 1: ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలలో అమెరికన్ డాలర్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు చైనా సన్నద్ధమవుతోంది. అమెరికన్ డాలర్‌కు ప్రత్యామ్నాయంగా తన డిజిటల్ కరెన్సీ రెన్మిన్బీని ప్రోత్సహించేందుకు చైనా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా సుంకాల దుష్ప్రభావాలు బాధిస్తున్న వేళ చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అమెరికా సుంకాల దాడిని ఎదుర్కొంటున్న పలు దేశాలు డాలర్‌పై ఆధారపడకుండా ఉండేందుకు మార్గాలను అన్వేషిస్తున్న సమయంలో చైనా వాటికి ఆశా కిరణంలా కనిపిస్తోంది. తమ స్థానిక కరెన్సీలను డాలర్లుగా మార్చకుండా నేరుగా వాణిజ్యాన్ని చేసేందుకు దేశాలకు వీలు కల్పించే డిజిటల్ కరెన్సీగా రెన్మిన్బీని చైనా గనుక రూపొందిస్తే ప్రపంచ వాణిజ్యానికి అదో గొప్ప ప్రయోజనంగా రుజువవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, అంతర్జాతీయ లావాదేవీల కోసం డిజిటల్ కరెన్సీపై ఆధారపడేందుకు చైనాను ఇతర దేశాలు ఎంతవరకు నమ్మగలవన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. దీనిపై కొందరు నిపుణులు మరింత స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశారు.
వేగంగా పనిచేసే ‘రెన్మిన్బీ’తో కొత్త వ్యవస్థకు రూపు
అమెరికా నియంత్రణ వెలుపల సీమాంతర చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించడం ద్వారా ప్రపంచ ఆర్థిక లావాదేవీలకు చైనా కొత్త డిజిటల్ యువాన్ వ్యవస్థ కొత్త రూపు ఇవ్వగలదని యాక్సిస్ బ్యాంకు రిటైర్డ్ వైస్ ప్రెసిడెంట్ నరీందర్ కుమార్ భాసిన్ అభిప్రాయపడ్డారు. పది సెకండ్ల లోపు వేగంతో లావాదేవీలను ప్రాసెసింగ్ చేస్తూ ఆసియన్, పశ్చిమాసియా దేశాలకు చెందిన బ్యాంకులతో అనుసంధానమవుతూ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ కమ్యూనికేషన్స్(స్విఫ్ట్) ప్రొటోకాల్స్కి అతీతంగా బీజింగ్ కొత్త చెల్లింపు వ్యవస్థ పని చేయగలిగితే స్థానిక కరెన్సీల వాణిజ్యాన్ని క్రమబద్ధం చేయడంతోపాటు అమెరికన్ డాలర్, స్విఫ్ట్‌పై ఆధారపడడాన్ని తగ్గించవచ్చని ఆయన చెప్పారు. వేగంగా, చౌకగా, ఆంక్షలను తట్టుకునే విధంగా ప్రత్యామ్నాయ ఆర్థిక సదుపాయాన్ని సృష్టించడం ద్వారా అమెరికా డాలర్ ప్రాబల్యానికి మూడు స్తంభాలైన చమురు వాణిజ్యం, స్విఫ్ట్ మధ్యవర్తులు, డాలర్‌తో విలువ కట్టే నిల్వలను చైనా నేరుగా సవాల్ చేయగలదని ఆయన తెలిపారు.
ఇది ఆర్థిక పోటీకి మించినదని, ఇది సమాంతర ఆర్థిక ప్రపంచాన్ని సృష్టించడమేనని భాసిన్ తెలిపారు. బ్యాంకుల మధ్య చెల్లింపు ఆదేశాలను మాత్రమే స్విఫ్ట్ పంపగలదని, కాని చైనా సృష్టించనున్న వ్యవస్థ తన సెంట్రల్ బ్యాంకు నెట్వర్క్ ద్వారా వాస్తవ డిజిటల్ కరెన్సీని తక్షణమే బదిలీ చేయగలదని ఆయన తెలిపారు. ఇది చాలా వేగంగా, అత్యంత చవకగా పనిచేస్తుందని, స్విఫ్ట్ తరహాలో లావాదేవీలకు చార్జీలను వసూలు చేసి, సమయాన్ని వృథా చేసే మధ్యవర్తిత్వ బ్యాంకులపై చైనా వ్యవస్థ ఆధారపడదని ఆయన చెప్పారు. దశాబ్దాల పాటు డాలర్ విలువతో కూడిన చెల్లింపులకు వెన్నెముకగా నిలిచిన సాంప్రదాయ స్విఫ్ట్ వ్యవస్థను తప్పిస్తూ చైనాకు చెందిన బ్లాక్ చెయిన్ ఆధారిత ఆర్థిక సదుపాయానికి ప్రపంచ వాణిజ్య విలువలో దాదాపు 38 శాతం నేరుగా అనుసంధానం కాగలదని ఆయన అంచనా వేశారు. చైనా చెల్లింపు నెట్‌వర్క్‌ను ఉపయోగించడం వల్ల దేశాల లావాదేవీల డేటా చైనా నియంత్రణ సంస్థలకు బహిర్గతమవుతుందని.. అలాగే అది చైనా సాంకేతిక మౌలిక సదుపాయాలపై ఆధారపడేలా చేస్తుందని.. ఇది ఆయా దేశాల ఆర్థిక స్వాతంత్య్రాన్ని పరిమితం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బ్రిక్స్, ఆసియన్ దేశాలు డిజిటల్ యువాన్‌ను వినియోగిస్తున్నాయి.
చైనాకు పలు దేశాలు మద్దతిచ్చే అవకాశం
అమెరికాతో వాణిజ్య, టెక్నాలజీ ఉద్రిక్తతలు ఉధృతం అవుతున్న తరుణంలో డాలర్‌కు ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను కనుగొనాలన్న చైనా ప్రయత్నానికి అనేక దేశాలు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తన డిజిటల్ కరెన్సీని బలోపేతం చేసుకోవడంతో పాటు విస్తరించుకోవాలనుకుంటున్న తన ఆర్థిక నెట్‌వర్క్‌లోకి ఇతర దేశాలను తీసుకురాగలనని చైనా ఆశిస్తోంది. చైనా చేపడుతున్న ఈ చర్యల ద్వారా సుంకాల వల్ల కలిగే ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభించగలదా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. అమెరికన్ డాలర్ ప్రమేయం లేకుండా ఏ రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు జరిగితే దాని వల్ల ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలిపారు. స్థానిక లేదా ప్రత్యామ్నాయ కరెన్సీల ద్వారా జరిగే వాణిజ్య లావాదేవీల వల్ల డాలర్ ఆధారిత లావాదేవీల వల్ల జరిగే అదనపు ఖర్చులు తగ్గిపోయి వాణిజ్యం కొద్దిగా చవకగా మారుతుందని వారు తెలిపారు.