న్యూఢిల్లీ, నవంబర్ 25: షాంఘై విమానాశ్రయంలో లేఓవర్ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ భారతీయ మహిళను వేధించినట్లు వచ్చిన ఆరోపణలను చైనా మంగళవారం తోసిపుచ్చింది. అయితే అరుణాచల్ ప్రదేశ్‌ని జాగ్నాన్ అని పిలిచే చైనా.. మరోసారి అది తమ భూభాగమేనని వాదించింది. నవంబర్ 21 లండన్ నుంచి జపాన్‌కు ప్రయాణిస్తున్న ఓ బ్రిటన్ నివాసురాలైన భారతీయ మహిళ పేమా వాంగ్జామ్ థోంగ్దోక్ షాంఘై విమానాశ్రయంలో తన 3 గంటల ట్రాన్సిట్ హాల్ట్ 18 గంటల వేధింపులకు దారితీసిందని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు.
ఆమె ఆరోపణలపై మంగళవారం విలేకరుల సమావేశంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ వివరణ ఇస్తూ భారతీయురాలికి ఎటువంటి వేధింపులు లేవని చెప్పారు. ఇదే సందర్భంగా అరుణాచల్‌పై తమ వాదనను ఆయన మరోసారి వినిపించారు. జాంగ్నాన్(అరుణాచల్) చైనా భూభాగం. భారత్ అక్రమంగా స్థాపించుకున్న అరుణాచల్ ప్రదేశ్‌ని చైనా ఎన్నడూ గుర్తించలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు చైనా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని, అక్కడ నివసించే ప్రజలకు భారతీయ పాస్‌పోర్టులతో ప్రయాణించే సంపూర్ణ హక్కులు ఉన్నాయని భారత్ పునరుద్ఘాటించినట్లు అధికారులు చెప్పారు.