Kharge : భారత ఎన్నికల సంఘం (ECI) పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేళ్లుగా ఈసీ ఓట్ల చోరులను కాపాడుతూ వస్తోందని, కీలక సమాచారాన్ని దాచి పెట్టిందని ఆరోపించారు. 2023లో కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) కు ముందు ఓటరు జాబితా నుంచి ఓట్లను తొలగించడానికి చేసిన యత్నానికి సంబంధించిన కీలక డేటాను ఇప్పటికీ ఎన్నికల సంఘం బయటపెట్టలేదన్నారు.
మే 2023 కర్ణాటక ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించాలని చేసిన ప్రయత్నాలను తమ పార్టీ బయటపెట్టిందని ఖర్గే చెప్పారు. అప్పట్లో దీనివల్ల వేలమంది ఓటర్లు తమ ఓటు హక్కులు కోల్పోయారన్నారు. ఓటర్లను మోసం చేయడానికి జరిగిన భారీ ప్రయత్నానికి స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ కీలక విషయాలను దాచిపెట్టి, ఓట్ల చోరీ వెనక ఉన్న వారిని ఈసీ సమర్థంగా రక్షించిందన్నారు.
ఓట్ల చోరీకి పాల్పడుతున్న వారిని కాపాడటమే లక్ష్యంగా ఈసీ పదేళ్లుగా పని చేస్తోందని ఖర్గే చెప్పారు. అందుకు చట్టాలను మార్చడానికి కూడా వెనకాడట్లేదని విమర్శించారు. నాడు కర్ణాటకలో చేసిన విధంగా ప్రస్తుతం బీహార్లోనూ ఓట్ల చోరీకి పాల్పడేందుకు కేంద్రం, ఈసీ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఓట్ల చోరీ ద్వారా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఓట్ల చోరీ చేసిందని, బీహార్లో మాత్రం బీజేపీ, ఈసీని ఒక్క ఓటు కూడా చోరీ చేయనివ్వబోమని అన్నారు. త్వరలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బీహార్లో చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారుతున్నదని తెలిపారు.