న్యూఢిల్లీ: జాతీయ జ్యుడీషియల్ డాటా గ్రిడ్(ఎన్జేడీజీ)తో సుప్రీంకోర్టును అనుసంధానం చేయబోతున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రకటించారు. దీంతో ఇకనుంచి తాలూకా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు కోర్టు తీర్పులు, కేసులకు సంబంధించి సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుందని సీజేఐ గురువారం తెలిపారు.
ఇప్పటివరకూ హైకోర్టు స్థాయి వరకు మాత్రమే కోర్టు తీర్పులు, కేసుల సమాచారం ఎన్జేడీజీలో పొందుపర్చుతూ వస్తున్నారు. ఇకపై సుప్రీంకోర్టు స్థాయి వరకు తాజా వివరాలు ఆన్లైన్ పోర్టల్లోకి రాబోతున్నాయి. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, ‘ఇది చరిత్రాత్మకమైన రోజు. ఒక్క బటన్ను క్లిక్ చేయటం ద్వారా వివిధ రకాల కేసుల తాజా సమాచారం తెలుసుకోవచ్చు’ అని అన్నారు.