అమ్రావతి (మహారాష్ట్ర), జూన్ 26: భారత రాజ్యాంగమే అత్యున్నతమైనదని, ప్రజాస్వామ్యానికి చెందిన మూడు విభాగాలు దాని కిందనే పనిచేస్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. తన స్వస్థలం తూర్పు మహారాష్ట్రలోని అమ్రావతి నగరంలో బుధవారం తన కోసం ఏర్పాటు చేసిన సన్మాన సభలో గత నెల 52వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ గవాయ్ ప్రసంగించారు.
రాజ్యాంగ మౌలిక స్వరూపంపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన ఓ తీర్పును ప్రస్తావిస్తూ రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్ మార్చలేదని ఆయన తెలిపారు. ‘పార్లమెంటే సుప్రీం అని కొందరు అంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం రాజ్యాంగమే అత్యున్నతమైనది.
ప్రజాస్వామ్యానికి చెందిన కార్య నిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలలో ఏ వ్యవస్థ అత్యున్నతమైనదన్న చర్చ ఎప్పుడూ ఉంది. పార్లమెంటే అత్యున్నతమైనదని కొందరు నమ్ముతారు, కొందరు చెబుతారు. అయితే నా అభిప్రాయం ప్రకారం రాజ్యాంగమే అత్యున్నతమైనది. ప్రజాస్వామ్యానికి చెందిన మూడు వ్యవస్థలు దాని కిందే పనిచేయాల్సి ఉంటుంది’ అని జస్టిస్ గవాయ్ తెలిపారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీచేసినంత మాత్రాన న్యాయమూర్తి స్వతంత్రుడు కాలేరని ఆయన చెప్పారు. మనకో బాధ్యత ఉందని, మనం ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలకు రక్షకులమని ప్రతి న్యాయమూర్తి సదా గుర్తుంచుకోవాలని జస్టిస్ గవాయ్ సూచించారు. మన చేతిలో అధికారమే కాదు దానిపైన బాధ్యత కూడా ఉందని గుర్తుంచుకోవాలని ఆయన హితవు చెప్పారు. తమ తీర్పు పట్ల ప్రజలు ఎలా మాట్లాడతారో లేక ఎలా భావిస్తారో అని మనం ఆలోచించరాదని, స్వతంత్రంగా నిర్ణయ ప్రక్రియ జరగాలని ఆయన తెలిపారు. తన తీర్పులు, తన కర్తవ్యాలే మాట్లాడాలె తప్ప తాను మాట్లాడకూడదన్నది తన సిద్ధాంతమని జస్టిస్ గవాయ్ అన్నారు.