గరియాబంద్ : బీజేపీ పాలిట ఛత్తీస్‌గఢ్‌లోని ఉదంతి- సీతానది టైగర్ రిజర్వ్ పరిధిలోని ఎనిమిది గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు ప్రధాన లైన్ల ద్వారా సంప్రదాయ విద్యుత్తును డిమాండ్ చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీకి తమ రక్తంతో 800 లేఖలు రాశారు. తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్ ఆధారిత వ్యవస్థలు సరిపోకపోవడంతో విద్యుత్తు కోసం తీవ్ర అవస్థలు పడుతున్నామని, ఈ విషయాన్ని తెలియజేసేందుకే గ్రామస్తులమంతా రక్తంతో లేఖలు రాసినట్లు తెలిపారు. అయితే అడవుల లోపల విద్యుత్తు లైన్లు వేస్తే, అవి వన్యప్రాణుల ఆవాసాలను దెబ్బతీస్తాయని అధికారులు చెబుతున్నారు.. ఈ గ్రామస్తులు ఈ నిరసన లేఖలు రాసేముందు అద్గాడి గ్రామంలో ఒక చోటుకు చేరుకున్నారు.
తరువాత వారు పిలిపించిన వైద్యుడొకరు వేర్వేరు సిరంజీలను ఉపయోగించి, గ్రామస్తుల నుంచి రక్తాన్ని సేకరించారు. దానినే వారు ప్రధానికి లేఖ రాసేందుకు ఉపయోగించారు. ఈ ప్రాంతానికి చెందిన పంచాయతీ సభ్యుడు సంజయ్ నేతమ్ విలేకరులతో మాట్లాడుతూ ఎనిమిది పంచాయతీలకు చెందిన 48 గ్రామాల ప్రజలు ఇక్కడకు చేరుకున్నారని, వారంతా తమ ప్రాంతానికి విద్యుత్తు సదుపాయం కావాలని కోరుతూ రక్తంతో లేఖలు రాసి, స్పీడ్ పోస్టులో ప్రధాని మోదీకి పంపినట్లు తెలిపారు.