కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 20: తుపాకుల మోతతో దండకారణ్యం రక్తసిక్తమైంది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా పీడియా అడవుల్లో గురువారం ఉదయం నక్సల్స్, పోలీస్ వర్గాల మధ్య సుమారు నాలుగు గంటలపాటు భీకర పోరు సాగింది.
ఘటనా స్థలం నుంచి 26 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్-నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దు కోరోస్కోడో గ్రామ సమీప అడవుల్లో జరిగిన మరో ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. ‘మోదీ సర్కార్ మావోయిజాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. 2026, మార్చి 31వ తేదీ నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారుతుంది’ అంటూ హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.