రాయ్‌పూర్: ముఖ్యమంత్రి ఆకస్మిక పిలుపుతో పలువురు మంత్రులు ఆయన అధికార నివాసానికి చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. దీంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగనున్నదా? మంత్రుల శాఖలు మారబోతున్నాయా? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. (Midnight Cabinet Meet) ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, గురువారం సాయంత్రం ఆకస్మిక ఆదేశాలు జారీ చేశారు. మంత్రులందరిని తన అధికారిక నివాసానికి పిలిపించారు. దీంతో పలువురు మంత్రులు ముందుగా నిర్ణయించుకున్న తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. హుటాహుటిన రాయ్‌పూర్‌కు తిరిగి వచ్చారు.
కాగా, గురువారం రాత్రి 10 గంటల సమయంలో సీఎం విష్ణుదేవ్ సాయి అధికార నివాసంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. శుక్రవారం తెల్లవారుజామున 1:40 గంటల వరకు ఇది కొనసాగింది. ఈ అసాధారణ మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు బీజేపీ సంస్థాగత అగ్ర నాయకులు కూడా హాజరయ్యారు. దీంతో రాజకీయ వదంతులు జోరందుకున్నాయి. బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగనున్నదా? శాఖలు మారబోతున్నాయా? పదవీకాలం మధ్యలోనే ప్రభుత్వ పనితీరుపై బీజేపీ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నదా? అన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి.
అయితే ఈ అసాధారణ, అత్యవసర మంత్రివర్గ సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ ఊహాగానాలకు తెరదించేందుకు ఆయన ప్రయత్నించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అసలు చర్చ జరుగలేదని తెలిపారు. ‘ఈ వార్త మీడియాలో ఎలా వచ్చిందో నాకు తెలియదు. అంతా బాగానే ఉంది’ అని నవ్వుతూ అన్నారు.
మరోవైపు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పనితీరును సమీక్షించుకున్నామని, తదుపరి పాలనకు సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం, బీజేపీ మధ్య సమన్వయ బలోపేతంతో పాటు ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు వెల్లడించాయి.
అయినప్పటికీ సీఎం విష్ణుదేవ్ సాయి అర్ధరాత్రి వరకు అత్యవసరంగా అసాధారణ రీతిలో మంత్రులతో సమావేశం నిర్వహించడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. మంత్రుల మార్పులు, రాజీనామాల ఊహాగానాలు, నాయకత్వ మార్పుకు సంబంధించిన చర్చల వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో ఒత్తిడి పెరిగినట్లు పేర్కొంది. అందుకే ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి అర్ధరాత్రి వేళ అత్యవసర తరహాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని విశ్లేషించింది.