చెన్నై: పొరుగున నివసించే వృద్ధురాలి నుంచి డబ్బు, బంగారం చోరీకి దంపతులు ప్రయత్నించారు. వారిని పట్టుకున్న ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. (elderly woman hacked ) వాటిని నదిలో పడేశారు. వృద్ధురాలి మిస్సింగ్‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు చివరకు నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. 70 ఏళ్ల వృద్ధురాలైన విజయ మైలాపూర్‌లోని ఎంజీఆర్ నగర్లో నివసిస్తున్నది. ఆమె రోజు వారీ కూలీగా పని చేస్తున్నది.
కాగా, జూలై 17న విజయ అదృశ్యమైంది. దీంతో ఆందోళన చెందిన ఆమె కుమార్తె అన్ని చోట్ల వెతికింది. కనిపించకపోవడంతో జూలై 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత పొరుగింటికి చెందిన పార్తీబన్‌ను అనుమానించారు. జూలై 23న అతడ్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
మరోవైపు పోలీస్ స్టేషన్‌కు వెళ్లని పార్తీబన్ తన ఇంటి నుంచి పారిపోయాడు. భార్య సంగీతతో కలిసి విరుదునగర్ జిల్లాలో దాక్కున్నట్లు అతడి మొబైల్ ఫోన్ ట్రాక్ చేయడం ద్వారా పోలీసులు గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆ దంపతులను అరెస్ట్ చేశారు. వృద్ధురాలు విజయ మిస్సింగ్ గురించి వారిని ప్రశ్నించగా ఆమెను హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు.
భార్యాభర్తలైన పార్తీబన్, సంగీత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. వృద్ధురాలు విజయ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లు వారు గమనించినట్లు చెప్పారు. విజయ పర్సులో ఉన్న బంగారు గొలుసు, చెవిపోగులు, రూ.20 వేల నగదు చోరీ చేస్తుండగా ఆమె పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ వృద్ధురాలి గొంతునొక్కి హత్య చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికారని, గోనె సంచిలో ఉంచి బైక్‌పై తీసుకెళ్లి నదిలో పడేశారని పోలీసులు వివరించారు. మృతదేహాన్ని వెలికితీసినట్లు చెప్పారు. అరెస్ట్ చేసిన ఆ దంపతుల నుంచి బంగారు ఆభరణాలు, రూ.8 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.