చెన్నై, మార్చి 11: ఒక్క బటన్ నొక్కగానే నచ్చిన ఆహారం చేతికొస్తే ఎలా ఉంటుంది? బిర్యానీ ప్రియులకు చెన్నైలో అలాంటి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది బాయి వీటు కళ్యాణం(బీవీకే) బిర్యానీ సర్వీసెస్. భారత్‌లో మొట్టమొదటిసారిగా వెండింగ్ యంత్రం ద్వారా బిర్యానీ కొనుక్కొనే అవకాశాన్ని కల్పించింది. కొలతూర్ ప్రాంతంలో ప్రారంభించిన ఈ సదుపాయాన్ని త్వరలోనే నగరంలోని మరో 12 ప్రాంతాల్లో కల్పిస్తామని బీవీకే తెలిపింది. బీవీకే వెండింగ్ మెషీన్లో బిర్యానీ కొనడం చాలా సులువు. టచ్ స్క్రీన్‌పైన మెనూ పరిశీలించి, ఆర్డర్ ఎంపిక చేసి డబ్బులను క్యూర్ ఆర్ కోడ్ ద్వారా లేదా ఏటీఎమ్ కార్డ్ ద్వారా చెల్లిస్తే చాలు. ఆ తర్వాత ‘ఓపెన్ డోర్’ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు కోరిన బిర్యానీ బయటకు వస్తుంది. ఇలా ఆహారం ఆర్డర్ చేయడం భలేగా ఉందని ఓ ఫుడ్ బ్లాగర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశారు.