జైపూర్: ఎంబీఏ చదువుకుని చెన్నై కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్(Instagram Scam)లో మోసం చేశారు. ఆ ముగ్గుర్నీ మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో పట్టుకున్నారు. మంచి భవిష్యత్తు కల్పిస్తామని, పెళ్లి జరిపిస్తామని చెప్పి ఆ వ్యక్తులు అమ్మాయిని మోసం చేశారు. శ్రీగంగానగర్ పోలీసులు ఆ మోసగాళ్లను అరెస్టు చేశారు. నిందితులను వాసుదేవ్ శాస్త్రి అలియాస్ మనీశ్ కుమార్, అంకిత్ అలియాస్ రుద్ర శర్మ, ప్రమోద్ భార్గవ అలియాస్ బిట్టుగా గుర్తించారు. నరేశ్ అలియాస్ నరేంద్ర ఆచార్య ఈ గ్యాంగ్‌కు మైస్టర్మైండ్గా వ్యవహరించాడు.
సమస్యలను పరిష్కరిస్తామని, ప్రత్యేక పూజలు చేస్తామని, తంత్ర్య విద్యతో అన్ని సమస్యలను తీర్చుతామని ఆచార్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేస్తుంటాడు. ఎంబీఏ చదువుకున్న 24 ఏళ్ల గరిమ జోషి నుంచి అతను డబ్బులు వసూల్ చేశాడు. సుమారు 18 లక్షల వరకు తన వద్ద నుంచి కాజేసినట్లు వసుదేవ్, గౌతం శాస్త్రి, నరేంద్ర ఆచార్య, మనీశ్‌పై గరిమ ఫిర్యాదు చేసింది. 2024 అక్టోబర్‌లో శ్రీగంగానగర్‌కు విజిట్ చేశానని, వసుదేవ్ రీల్ చూసి, మొబైల్లో మాట్లాడనని, పెళ్లి గురించి, కెరీర్ గురించి చర్చినట్లు చెప్పింది. సమస్యలు తీర్చేందుకు పూజ చేయాలని సూచించాడని, అలాంటి సమస్యలను పరిష్కరించేందుకు తాను సిద్ధి సాధించినట్లు చెప్పాడని పేర్కొన్నది.
2024, అక్టోబర్ 6వ తేదీన శాస్త్రి 60 వేల తీసుకున్నాడని, ఆ తర్వాత పూజ మద్యలో వదిలేస్తే ఇంట్లో ఎవరైనా చస్తారని బెదిరించాడని చెప్పిందామె. గౌతమ్ శాస్త్రి, నరేంద్ర ఆచార్య, మనీశ్‌లతో ఫోన్లో మాట్లాడేలా చేశాడని, వేర్వేరు దిక్కుల్లో కూర్చుని పూజలు చేస్తామని వాళ్లు చెప్పినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఆన్లైన్లో వేర్వేరు యూపీఐ ఐడీల ద్వారా ఆ ముగ్గురు సుమారు 15.48 లక్షలు దొచుకున్నారని జోషి తెలిపింది. 2025, ఫిబ్రవరి ఆరో తేదీ వరకు ఆ డబ్బులు తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నది. కెరీర్ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ ఎటువంటి ఫలితం రాలేదని, అప్పుడు డబ్బులు వాపస్ ఇవ్వాలని అడిగినట్లు ఆమె చెప్పింది. దీంతో వాళ్లు బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నది.
ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తులు ఫేక్ బాబాలు అని గరిమ తెలుసుకున్నది. క్లయింట్లను బెదిరిస్తూ డబ్బులు వసూల్ చేస్తున్నట్లు ఆరోపించింది. శ్రీగంగానగర్ పోలీసులకు ఆమె పోస్టు ద్వారా ఫిర్యాదు చేసింది. దాన్ని దర్యాప్తు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బును డిపాజిట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ ద్వారా ద్రువీకరించారు. గరిమ కేసు రిజిస్టర్ చేసిన విషయాన్ని తెలుసుకున్న ముగ్గురు పరారీ అయ్యారు.