న్యూఢిల్లీ: ప్రాణవాయువు (ఆక్సిజన్) స్థాయి తక్కువగా ఉన్నపుడు, మెదడులో తయారయ్యే రెండు రసాయనాలు రక్తపోటును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని కొత్త అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం ఈ రసాయనాల్లో ఒకటి ఆక్సిటోసిన్ కాగా, మరొకటి కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ (సీఆర్‌హెచ్). ఆక్సిటోసిన్‌ను లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది రక్తపోటు, పరస్పర సంబంధాలు, సాంఘిక అనుబంధాలను ప్రభావితం చేస్తుంది. అదే విధంగా ఒత్తిడికి గురైనపుడు స్పందించడం, ప్రవర్తనలో సీఆర్‌హెచ్ చెప్పుకోదగ్గ పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి హాని కలిగించేవాటిని గుర్తించి, తొలగించే ప్రక్రియలో కూడా ఇది ప్రముఖంగా వ్యవహరిస్తుంది. మస్తిష్క మూలంపై ఈ రెండు హార్మోన్లు చూపించే ప్రభావం గురించి తెలుసుకోవడం కోసం ఈ అధ్యయనం జరిగింది. ఈ నివేదికను జర్నల్ ఆఫ్ సైకాలజీలో ప్రచురించారు.