న్యూఢిల్లీ, డిసెంబర్ 31: చేపలు, మాంసం, కూరగాయలను ప్యాకింగ్ చేసి ఎక్కువ కాలం నిల్వ ఉంచటం వల్ల వాటి లోపలికి బాక్టీరియా చేరి పాడవుతాయి. అది తెలియక అవే వండుకొని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు, ఎక్కువ కాలం పాటు ఆహార పదార్థాలను తాజాగా ఉంచేందుకు హార్వర్డ్, నన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు స్మార్ట్ ఫుడ్ ప్యాకేజింగ్ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ-కోలీ, లిస్టీరియా, సాల్మొనెల్లా లాంటి బాక్టీరియాలను చంపేసే యాంటిమైక్రోబియల్స్తో ప్లాస్టిక్ కవర్లలాంటి ప్యాకేజింగ్ మెటీరియల్‌ను తయారు చేశారు. దీంతో ప్యాకింగ్ చేస్తే సాధారణ ప్యాకేజింగ్ కంటే మూడు నాలుగు రోజులు ఎక్కువ నిల్వ ఉంటున్నట్టు వారు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌తో పోల్చితే ఇది పర్యావరణహితమైనవని తెలిపారు.