Pollution | హైదరాబాద్, జనవరి 24 : భాగ్యనగరంలో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్నది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఫారెస్ట్ బయో డైవర్సిటీ పరిశోధకులు ఒక కొత్త విరుగుడును కనిపెట్టారు. దుమ్ము, వాయు కాలుష్యాన్ని సమర్థంగా అరికట్టడానికి కొన్ని జాతుల వృక్షాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని వీరు గుర్తించారు. ముఖ్యంగా మర్రిజాతి చెట్టు ఈ విషయంలో ముందుంటుందని ఆ పరిశోధన తేల్చింది.
ఈ కోవలో వేప, ఆర్కిడ్, కానుగ చెట్లు సైతం కాలుష్య స్థాయిని తగ్గించడంలో ప్రముఖంగా వ్యవహరిస్తాయని నిర్ధారించింది. ఈ జాతుల చెట్లు దుమ్మును అడ్డుకుంటాయని, గాలిలోని ధూళిని తట్టుకుని ఎదగగలవని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ పరిశోధన తేల్చింది. ఈ పరిశోధనను పంకజ్ సింగ్, భారతీ పటేల్లు నిర్వహించారు. మర్రి, వేప, ఆర్కిడ్, కానుగ చెట్లు వాయు కాలుష్య నియంత్రణలో చక్కని పాత్ర పోషించినట్టు గుర్తించారు.