న్యూఢిల్లీ: డూప్లికేట్ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ల సమస్య దశాబ్దాల నుంచి ఉందని, ఈ సమస్యను రానున్న మూడు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ సమస్యను కప్పిపుచ్చుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈపీఐసీ నంబరుతో సంబంధం లేకుండా, ఓ పోలింగ్ స్టేషన్‌తో అనుసంధానమైన ఎలక్టర్ (ఓటరు) తన ఓటును అదే పోలింగ్ స్టేషన్లో మాత్రమే వేయవచ్చునని, వేరొక చోట ఓటు వేయరాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చివరికి తన నేరాన్ని అంగీకరించిందని టీఎంసీ శుక్రవారం పేర్కొంది. అనేకమందికి డూప్లికేట్ ఎలక్టొరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ (ఈపీఐసీ) నంబర్లను కేటాయించినట్లు ఒప్పుకుందని ఆ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే ఎక్స్‌లో ట్వీట్ చేశారు.ఈసీ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నపుడు, ఎలక్టొరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ‘సరైనవికానటువంటి సిరీస్’ను ఏ విధంగా ఉపయోగించారని ఆయన ప్రశ్నించారు మరోవైపు డూప్లికేట్ ఓటర్ ఐడీల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తేందుకు విపక్ష ఎంపీలు కసరత్తు ప్రారంభించారు. స్వల్పకాలిక చర్చ, జీరో అవర్, కాలింగ్ అటెన్షన్ వంటి నిబంధనల ప్రకారం టీఎంసీ, ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.