చెన్నై : తమిళనాడులో జరిగిన రథోత్సవం వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్నది. రథాన్ని లాగుతున్న సమయంలో భక్తులపై పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలోని పాపరకట్టికి సమీపంలో ఉన్న మాదేహళ్లి గ్రామంలో చోటు చేసుకున్నది. కాళీయమ్మన్ ఆలయంలో ఏటా ఉత్సవాలు నిర్వహించడం నిర్వహించడం ఆనవాయితీ. ఏడాది సైతం ఉత్సవాల్లో భాగంగా ప్రారంభమాయ్యయి. ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన రథోత్సవం సోమవారం నిర్వహించారు.
రథోత్సవాన్ని కనులారా తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాయంత్రం కాళీయమ్మన్ ఆలయం చుట్టూ పెద్ద సంఖ్యలో భక్తులు రథాన్ని తాడుతో లాగుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా రథం భక్తులపై పడిపోయింది. ఐదుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. తీవ్ర గాయాలతో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.