ఉత్తరకాశి, మే 15: చార్ధామ్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. దీంతో వారు ట్రాఫిక్, ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. తొలిరోజున యమునోత్రికి దాదాపు 45 వేల మంది దర్శనానికి రావడంతో ఇరుకైన దారిలో నడిచేందుకు కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం గంగోత్రి యాత్ర రూట్లో పెద్దయెత్తున ట్రాఫిక్ ఉంటున్నది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అధికారులు టూరిస్టు వాహనాలను పలుచోట్ల నిలిపివేస్తున్నారు. అయితే ఇది గంగోత్రి, యమునోత్రి హైవేలపై మరింత ట్రాఫిక్‌కు దారితీసింది. 15-20 వేల మంది భక్తులు కొన్ని గంటలపాటు తమ వాహనాల్లో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో చాలా మంది భక్తులు తమ చార్ధామ్ యాత్రను మధ్యలోనే ముగించుకొని తిరిగి వెనక్కు వెళ్లిపోతున్నారు. హైవేపై పలు పాయింట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతో గంగోత్రి చేరుకొనేందుకు 16-20 గంటల సమయం పడుతుందని కొంత మంది భక్తులు పేర్కొన్నారు. యమునోత్రి హైవేపై కూడా ఇదే పరిస్థితి ఉన్నదని చెప్పారు. రద్దీకి తగిన ఏర్పాట్లు చేయడంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం విఫలమైందని మహారాష్ట్రకు చెందిన అనిత అనే యాత్రికురాలు విమర్శించారు. ఎంతో ఖర్చు పెట్టుకొని యాత్రకు వచ్చి తీవ్ర నిరాశకు గురయ్యామని అన్నారు. కనీసం తాగునీరు, ఆహారం, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని గుజరాత్‌కు చెందిన మనీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.