అలహాబాద్: పేరు ఎంపిక చేసుకోవడం లేదా మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సమీర్ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. తన స్కూలు సర్టిఫికెట్స్లో తన పేరును షానవాజ్ నుంచి మొహమ్మద్ సమీర్ రావుగా మార్చాలని కోరుతూ ఆ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. తన అభ్యర్థనను తిరస్కరించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషనర్ వాదించాడు.
పేరు మార్చుకునే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో ఒకటని శనివారం వెలువరించిన తీర్పులో కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ కింద వాక్ స్వాతంత్య్రం, 21వ అధికరణ కింద వ్యక్తిగత స్వేచ్ఛ, 14వ అధికరణ కింద సమానత్వ హక్కు వంటివి ఇందులో ఉన్నాయని కోర్టు తెలిపింది. వ్యక్తి పేరు ఆ వ్యక్తి గుర్తింపులో కీలక భాగమని, పేరు మార్పు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని కోర్టు పేర్కొంది.
స్కూలు రికార్డుల్లో తన పేరును మార్చడానికి ఉత్తరప్రదేశ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిరాకరించడంతో సమీర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సర్టిఫికెట్ జారీ అయిన మూడేళ్లలోపల పేరు మార్పునకు అనుమతిస్తామని పేర్కొంటూ బోర్డు ఓ నిబంధనను ఉటంకించింది. అయితే ఈ నిబంధనను కోర్టు తోసిపుచ్చింది. ఇది ఏకపక్షంగా ఉందని, రాజ్యాంగం నిర్దేశించిన నిష్పాక్షికత, న్యాయం, సమానత్వం సూత్రాలకు భిన్నంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది.