కోల్‌కతా : టీఎంసీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ రెబల్ టీమ్స్ లో చేరుతున్నారు. తాజాగా పార్టీ బెంగాల్ అధ్యక్షురాలు చంద్రిమ భట్టాచార్య తన పదవికి శనివారం రాజీనామా చేసి రెబల్ నేత రితబ్రత బెనర్జీ టీమ్‌లో చేరారు. నెల క్రితం ఆ పదవిలో ఉన్న సుభ్రతా భక్షి రెబల్ టీమ్‌లో చేరగా మమతా బెనర్జీ ఏరికోరి చంద్రిమకు పదవిస్తే ఆమె కూడా ఇప్పుడు అదే బాట పట్టారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు చంద్రిమ తన లేఖలో తెలిపారు. మమత పార్టీలో కష్టపడ్డవారికి ప్రయోజనం లేదని, ఆమె నిర్ణయాలపై నమ్మకం లేదని, అక్కడ పనిచేయడం వీలు కాక పదవులకు రాజీనామా చేస్తున్నట్టు చంద్రిమ భట్టాచార్య సోషల్ మీడియా పోస్టులో చెప్పుకొచ్చారు. శనివారం బెంగాల్ అసెంబ్లీలోని రెబల్ నేత రితబ్రత బెనర్జీ చాంబర్లో ఆమె చర్చలు జరిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో చంద్రిమ పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. దీదీకి అత్యంత నమ్మకస్తురాలిగా ఆమెకు పేరున్నది.
‘తృణమూల్ కార్యాలయాల్ని ఆక్రమిస్తున్న బీజేపీ’
పశ్చిమ బెంగాల్లో మాజీ సీఎం మమతా బెనర్జీ వర్గం ‘తృణమూల్’కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కోల్‌కతాలో జరిగినట్టే..రాష్ట్రమంతటా తమ పార్టీ కార్యాలయాల్ని అధికార బీజేపీ స్వాధీనం చేసుకుంటున్నదని మమత బెనర్జీ వర్గం నేత, ఎంపీ సౌగత్‌రాయ్ శనివారం ఆరోపించారు. రాష్ట్రంలో తమదే నిజమైన తృణమూల్..అంటూ రెబల్ గ్రూప్ నాయకుడు రితబ్రత బెనర్జీ చెప్తున్న మాటల్ని ఆయన ఖండించారు. శుక్రవారం కోల్‌కతాలో తృణమూల్ కార్యాలయాన్ని రెబల్ వర్గం తమ ఆధీనంలోకి తీసుకోవటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై సౌగత్‌రాయ్ స్పందిస్తూ, ‘కొంతమందితో కూడిన ఒక గ్రూప్ పార్టీ కార్యాలయంలో చొరబడి తాళాలు వేశారు. వాటిని పగలగొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బెంగాల్ అంతటా బీజేపీ ఇదే విధంగా చేయబోతున్నది. క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నది’ అని ఆరోపించారు.