Pragyan rover | హలో అండీ.. నేను రోవర్ ప్రజ్ఞాన్‌ను. చందమామ సంగతి తేల్చేందుకు ఇస్రో నన్ను జాబిల్లిపైకి పంపిన విషయం మీకు తెలుసు కదా. జాబిల్లిపై సురక్షితంగా దిగిన వెంటనే లేటెందుకని నేను, విక్రమ్ పని మొదలుపెట్టాం. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతమంతా గుంతలమయమేనండి. ఫొటోలు తీసి భూమికి పంపాం. మీరు చూసే ఉంటారు. అలా నేను చంద్రుడిపై చక్కర్లు కొడుతుండగా.. నా ఎదురుగా నాలుగు మీటర్ల వ్యాసమున్న భారీ గొయ్యి కనిపించింది. గుండె ఆగినంత పనైపోయిందనుకోండి. వెంటనే ఫొటోలు తీసి విక్రమ్‌కు పంపా. విక్రమ్ వాటిని భూమిపై ఉన్న గ్రౌండ్ స్టేషన్‌కు సమాచారమిచ్చాడు. అలర్ట్ అయిన ఇస్రో శాస్త్రవేత్తలు.. నేను ప్రమాదంలో ఉన్నానని గుర్తించి, నా రూట్ మార్చుకునేలా వెంటనే కమాండ్ పంపారు. దీంతో క్షణాల్లో నా మార్గం మార్చుకుని గుంత నుంచి దూరంగా వెళ్లిపోయా. దీనికి ముందు మరో ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నా. 100 మి.మీ లోతు ఉన్న గుంతను చాకచక్యంగా దాటేశా.
ఈ తతంగమంతా క్షణాల్లోనే..
ఇదంతా వినడానికి మీకు సరదాగానే ఉండొచ్చు. కానీ నాకు మాత్రం కొన్ని క్షణాల పాటు కాళ్లు చేతులు ఆడలేదు. ఈ తతంగమంతా ఏలా జరుగుతుందో వివరిస్తా. నేను పూర్తిగా సొంత పరిజ్ఞానంతో ముందుకు సాగలేను. నాకు అమర్చిన నావిగేషన్ కెమెరా సాయంతో 5 మీటర్ల దూరం వరకు చూడగలను అంతే. అలా ఆ కెమెరాతో ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి విక్రమ్‌కు పంపిస్తుంటా. విక్రమ్ వాటిని గ్రౌండ్ స్టేషన్‌కు పంపిస్తుంటాడు. ఆ ఫొటోలను ఇస్రో శాస్త్రవేత్తలు డౌన్లోడ్ చేసుకొని విశ్లేషిస్తారు. గ్రౌండ్, మెకానిజం బృందాలు వాటిపై చర్చిస్తాయి. అనంతరం డిజిటల్ ఎలివేషన్ మాడల్ (డీఈఎం)గా పిలుచుకునే నా మార్గానికి సంబంధించిన కమాండ్‌ను పంపిస్తారు. వాటి ఆధారంగా నేను ముందుకు సాగుతాను. ఉంటా మరీ.. అసలే టైం తక్కువ ఉంది. జాబిల్లి గురించి మరిన్ని పరిశోధనలు చేసి మీకు బోలెడు సమాచారం పంపించాలి.